ఆర్బీఐ డెడ్‌లైన్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి


ఇవాళ‌ ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ బలపడింది. ఉదయం రూపాయి దాదాపు 10 పైసలు లాభపడి 92.57 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం ముగింపు ధర 92.66గా ఉంది. బ్యాంకులు తమ ఆర్బిట్రేజ్ పొజిషన్లను రద్దు చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధించిన గడువు నేటితో ముగియనుండటమే ఇందుకు ప్రధాన కారణం.ఆఫ్‌షోర్ నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ (ఎన్‌డీఎఫ్‌) మార్కెట్‌లో బ్యాంకుల మితిమీరిన లావాదేవీలను నియంత్రించేందుకు ఆర్బీఐ గత నెలలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పనిదినం ముగిసేసరికి బ్యాంకు నికర ఓపెన్ పొజిషన్ 100 మిలియన్ డాలర్లకు మించరాదని స్పష్టం చేసింది. ఈ గడువును పొడిగించాలని పలు బ్యాంకులు కోరినప్పటికీ, ఆర్బీఐ అందుకు అంగీకరించలేదు. దీంతో బ్యాంకులు తమ పొజిషన్లను సరిచేసుకుంటున్నాయి. ఆర్బీఐ తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మార్కెట్ వేచి చూసే ధోరణిలో ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరుగుతుండటం ట్రేడర్లను ఆందోళనకు గురిచేస్తోంది. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 1.13 శాతం పెరిగి 97 డాలర్ల వద్ద ఉండగా, యూఎస్ డబ్ల్యూటీఐ క్రూడ్ 1శాతానికి పైగా పెరిగి 99.24 డాలర్లకు చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఏప్రిల్ 20 ఫ్యూచర్స్ ధర 3.23 శాతం పెరిగి రూ. 9,222 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఈ పరిణామాలపై ఇటీవల ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందిస్తూ, విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో అస్థిరతను అరికట్టేందుకే బ్యాంకులపై ఈ ఆంక్షలు విధించామని, ఇవి తాత్కాలిక చర్యలు మాత్రమేనని స్పష్టం చేశారు. బ్యాంకులు చేస్తున్న ఆర్బిట్రేజ్ ట్రేడ్‌ల వల్లే ఇటీవలి కాలంలో మార్కెట్‌లో ఒడిదొడుకులు పెరిగాయని ఆయన పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *