ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా రహదారుల నిర్మాణం


. పోర్టు కారిడార్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు
. గోదావరి పుష్కరాల్లోపే రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు పూర్తి
. ఈవీ బస్సుల వినియోగం పెంచుదాం
. సీఎం చంద్రబాబు ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం రహదారులు, భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, ఈవీ బస్సుల వినియోగం, వివిధ రాష్ట్రాలను అనుసంధానించేలా జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్షలో చర్చించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలి. మొత్తంగా 45,433 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటే… వాటిల్లో ఏటా 10,238 కిలోమీటర్ల మేర నిరంతర నిర్వహణ చేయాల్సి ఉంది. ప్రజలకు రోడ్ల వల్ల ఇబ్బంది లేకుండా చూడాలి. రోడ్ల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా చేపట్టాలి. ఎక్కడైనా రోడ్లకు గుంతలు పడితే… వాటిని వెంటనే సరిదిద్దితే ఇబ్బందులు ఉండవు. రోడ్ల నిర్వహణలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారనే అంశాన్ని అధ్యయనం చేయాలి. ఆర్ అండ్ బీ రహదారుల నిర్వహణ కోసం నిధుల కొరత లేకుండా చూడాలి. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి… దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలి. రహదారి నిర్వహణకు ప్రామాణికతను నిర్దేశించాలి. స్థానికంగా భౌగోళిక పరిస్థితులు, వాతావరణం అంశాలను పరిగణనలోకి తీసుకుని రోడ్ల నిర్వహణలో చర్యలు చేపట్టాలి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, నల్లరేగడి భూములున్న చోట హైబ్రీడ్ మోడల్‌లో బీటీ లేదా వైట్ ట్యాప్ రోడ్ల నిర్మాణం చేపడితే బాగుంటుంది. కాలువలు ఉన్న ప్రాంతాల్లో 570 కిలోమీటర్ల మేర రహదారులు పదేపదే ధ్వంసమవుతున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఏ మెటీరియల్‌తో రోడ్ల నిర్మాణం జరిగితే బాగుంటుందనేది ఆలోచన చేయాలి. దీనిపై యూనివర్సిటీలతో అధ్యయనం చేయిస్తే… కొత్త ఆవిష్కరణలు వస్తాయి. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టండి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తంగా 471 గ్రామాల్లో రోడ్లకు మరమ్మతు చేపట్టాలి. గ్రేటర్ రాజమహేంద్రవరం పరిధిలో చేపట్టే రోడ్ల అభివృద్ధి అన్ని ప్రాంతాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా పనులు చేపట్టాలి. పుష్కరాలకు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ.400 కోట్లతో 531 కిలోమీటర్ల పొడవైన రహదారులను అభివృద్ధి చేయాలి. దీనికోసం సాస్కీ నిధులు వినియోగించుకోవాలి. కుంభమేళా తరహాలో పుష్కరాలకు నిధులు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలి’ అని సీఎం సూచించారు.
పోర్టుల అనుసంధానానికి ప్రాధాన్యత
‘రాష్ట్రంలో పోర్టులను అనుసంధానం చేసేలా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలి. ఆర్థిక లావాదేవీలకు కేంద్రంగా పోర్టులు ఉన్నాయి. పోర్టులను అనుసంధానించడంలో గుజరాత్ తరహా పద్ధతి అనుసరించాలి. ప్రస్తుతం తూర్పు భారతంలో తీర ప్రాంతం, పోర్టుల విషయంలో ఏపీ కీలకంగా ఉంది. తూర్పు, పశ్చిమ కారిడార్‌గా జాతీయ రహదారుల నిర్మాణం జరగాలి. ప్రస్తుతం 73 శాతం కార్గో రోడ్డు మార్గం ద్వారానే వెళ్తోంది. రైల్వే ద్వారా వెళ్లే కార్గో వ్యయం తక్కువగా ఉన్నట్టే, రహదారుల కార్గో వ్యయం కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. మూలపేట, విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టుల మధ్యనున్న ప్రాంతాలను అనుసంధానిస్తూ జాతీయ రహదారుల నిర్మాణం జరగాలి. పోర్టుల అనుసంధానం సమయంలో వాటికి సమీపంలోని పొరుగు రాష్ట్రాల సరిహద్దులు కలుపుతూ పధాన రహదారులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. రహదారుల నిర్మాణం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరగాలి. జాతీయ రహదారులకు సమీపంలో ఉండే ప్రాంతాల అభివృద్ధి జరగాలి’ అని సీఎం మార్గనిర్దేశనం చేశారు.
ఈవీలతో తక్కువ రవాణా వ్యయం
అతి తక్కువ వ్యయంతో ప్రజా రవాణా అందుబాటులోకి రావాలంటే ఈవీ బస్సుల వినియోగం సరైన మార్గమని సీఎం స్పష్టం చేశారు. సౌర విద్యుత్‌ను సమర్థంగా నిర్వహించడం ద్వారా విద్యుత్ కొనుగోలు ధరను రూపాయి మేర తగ్గించ గలిగామన్నారు. ‘ఈవీ బస్సులకు కిలోమీటరుకు రూ.72 వ్యయం అవుతోంది. వివిధ మోడళ్లను అధ్యయనం చేసి అతి తక్కువ వ్యయంతో ఈవీలు నిర్వహించాలి. చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ నైపుణ్యం లాంటి అంశాలను పరిశీలించాలి.
అన్ని కేటగిరీల్లోనూ ఏసీ ఈవీ బస్సులే ఉండాలి. ఈ సైకిళ్ల వినియోగం మరింతగా పెంచేలా ప్రోత్సహించాలి. ఈ-సైకిళ్లు మాస్ ట్రాన్స్‌పోర్టుగా మారేంతగా ప్రజలకు అవగాహన కల్పించాలి’ అని సీఎం అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశానికి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం, జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులు హాజరయ్యారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *