వాహనాలు, ఇళ్లల్లో విస్తృత తనిఖీలు
విజయవాడలో ఒకరి వద్ద గన్ లభ్యం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్ర పోలీసులు వజ్ర ప్రహార్ కార్యక్రమం చేపట్టారు. డీజీపీ హరీశ్ కుమార్‌గుప్తా ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం లక్ష్యంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ఈగల్ టీమ్ సభ్యులు ‘వజ్ర ప్రహార’ (నిర్బంధ తనిఖీలు) చేపట్టారు. వివిధ జిల్లాల్లో వందకుపైగా బృందాలతో సోదాలు నిర్వహించారు. అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి నిల్వలు, అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడే అనుమానితులపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈగల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్డెన్ సెర్చ్ నిర్వహించామన్నారు. రాష్ట్రంలో గంజాయి సరఫరా జరిగే 849 హాట్ స్పాట్స్ గుర్తించామని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా, విజయవాడలోని ఓ హోటల్‌లో తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి పోలీసులపై తుపాకీతో కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అయితే ట్రిగ్గర్ లాక్‌లో ఉండటంతో తుపాకీ పేలలేదు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రివాల్వర్, ఐదు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతన్ని విచారించగా, వరంగల్లుకు చెందిన కన్నం మురళిగా గుర్తించారు. అతనికి కొంత మందితో వివాదాలు ఉండటంతో ప్రాణభయంతో బీహార్ నుంచి గన్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అక్రమంగా ఆయుధం కలిగి ఉండటంతో పాటు పోలీసులపై కాల్పులకు ప్రయత్నించడంతో అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీసీపీ కష్ణకాంత్ మీడియా సమావేశంలో వెల్లడించారు.


