వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు ఆదివారం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో అభిమానులు, పార్టీ కార్యకర్తల అశ్రునయనాల మధ్య నిర్వహించబడ్డాయి. వేలాది మంది అభిమానులు తరలివచ్చి పెద్దాయన్ను చివరిసారిగా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు, వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ నేతలు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులు భార్య లక్ష్మీదేవి, కుమారులు వీరేష్ మారుతి చౌదరి, ఉదయ్ భాస్కర్ చౌదరి, తమ్ముడు వీసీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి వ్యవసాయ క్షేత్రంలో దహన సంస్కారాలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు, ప్రజలు మాట్లాడుతూ— నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ముఖ్యంగా సాగునీరు, తాగునీరు, రహదారుల నిర్మాణం, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, మున్సిపాలిటీ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.


