Last Updated:
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్చి 13, 14 తేదీల్లో విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించి, గిరిజన ప్రాంతాల్లో ‘మాట–మంతీ’లో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 13, 14 తేదీల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఈ పర్యటనను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను వినేందుకు ‘మాట–మంతీ’ అనే కార్యక్రమంలో పాల్గొనడం ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
పర్యటన షెడ్యూల్ ప్రకారం మార్చి 13న ఆయన హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ నివాసం నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్ పోటర్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో విశాఖపట్నం విమానాశ్రయానికి (Visakhapatnam International Airport) చేరుకోనున్నారు. అనంతరం విశాఖపట్నం నగరంలో ఉన్న Radisson Blu Resort Visakhapatnam లో బస చేయనున్నారు.
మార్చి 14న ఉదయం ఆయన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం పరిధిలోని లగిసిపల్లి హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఓనూరు జంక్షన్ వరకు రోడ్డు మార్గంలో ప్రయాణం కొనసాగించనున్నారు. ఈ పర్యటనపై ఇప్పటికే స్థానిక అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
తర్వాత ఆయన ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు గ్రామానికి నడకగా వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ‘మాట–మంతీ’ కార్యక్రమంలో పాల్గొని గిరిజన ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలు, అవసరాలు, అభివృద్ధి అంశాలపై చర్చించి ప్రభుత్వానికి సూచనలు తీసుకెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లోని ప్రజల జీవన పరిస్థితులు, విద్య, ఆరోగ్యం, రహదారులు వంటి కీలక అంశాలపై ప్రత్యక్ష సమాచారం సేకరించాలనే ఉద్దేశంతో ఈ పర్యటనను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పరిస్థితులను కూడా ఆయన సమీక్షించే అవకాశం ఉందని సమాచారం.
కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన తిరిగి లగిసిపల్లి హెలిప్యాడ్‌కు చేరుకుని హెలికాప్టర్ ద్వారా విశాఖపట్నం చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి జూబ్లీ హిల్స్ నివాసానికి చేరుకుంటారు. ఈ పర్యటనతో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన సమస్యలు మరోసారి ప్రధాన చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh



