అమెరికాకు మిత్రదేశాల షాక్


హోర్ముజ్‌కు యుద్ధనౌకల్ని పంపట్లేదని వెల్లడి
సిడ్నీ/టోక్యో: ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌పై భీకర దాడులకు తెగబడుతున్న అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ పరిధిలోని కీలక హోర్ముజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపా లని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సూచనను అనేక అమెరికా మిత్ర దేశాలు తిరస్కరించినట్లు సమాచారం. వీటిలో కొన్ని దేశాలు ఆచితూచి స్పందిస్తుండగా, ఇంకొన్ని దేశాలు కుదరదని తెగేసి చెబుతున్నాయి. హోర్ముజ్ జలసంధి వద్దకు కానీ, పశ్చిమాసియా ప్రాంతానికి కానీ తమ యుద్ధ నౌకను పంపేది లేదని ఆస్ట్రేలియా కేబినెట్ మంత్రి కేథరిన్ కింగ్ స్పష్టం చేశారు. యుద్ధనౌకను పంపాలని అమెరికా నుంచి తమకు అధికారిక విన్నపమేదీ అందలేద న్నారు. అయితే హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంత ముఖ్య మైందో తమకు తెలుసన్నారు. మరోపక్క జపాన్ ప్రధానమంత్రి సనాయీ తకాయిచి కూడా పార్లమెంటు వేదికగా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమా సియా సముద్ర జలాల మీదుగా రాకపోకలు సాగించే ఆయిల్ ట్యాంకర్లు, నౌకలకు భద్రత కల్పించేందుకు నౌకాదళాన్ని పంపే ఆలోచనేదీ లేదని ఆమె వెల్లడించారు. పశ్చిమాసియా వ్యవహారంలో సైనిక జోక్యంపై తాము ఏ దేశానికీ హామీని ఇవ్వలేదని తకాయిచి తెలిపారు. ఈ అంశంలో జపాన్ సొంతంగా ఏం చేయగలుగుతుంది, చట్టపరమైన పరిధిలో ఏం చేయొచ్చనే దానిపై చర్చిస్తున్నట్లు జపాన్ పార్లమెంటుకు ఆమె చెప్పారు. దక్షిణ కొరియా దేశాధ్యక్ష కార్యాలయం సైతం ఇదే రీతిలో స్పందించింది. తమ నౌకాదళాన్ని హోర్ముజ్ వద్దకు పంపే అంశంపై ప్రస్తుతం అమెరికాతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. చాలా జాగ్రత్తగా, సమగ్రంగా పరిస్థితిని సమీక్షించాకే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని స్పష్టం చేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సైతం దీనిపై ఆచితూచి స్పందిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్యానికి ఏర్పడిన అంతరాయాన్ని తొలగించేందుకు హోర్ముజ్ జలసంధిని తెరిపించాల్సిన ఆవశ్యకతపై ట్రంప్‌తో స్టార్మర్ చర్చించారని బ్రిటన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనిపై కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతోనూ బ్రిటన్ ప్రధాని మాట్లాడారు. ఈవిషయంలో పశ్చిమ దేశాలు, ఐరోపా దేశాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
పశ్చిమాసియాలో సైనికచర్య నిలిపివేస్తేనే…. చైనా షరతు
ఈ విషయంపై చైనా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. హోర్ముజ్ రక్షణకు తాము ముందుకురావాలంటే.. పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ అమెరికాఇజ్రాయిల్ఇరాన్‌లకు సూచించారు. ఈ ఘర్షణల వల్ల అంతర్జాతీయ ఇంధన ప్రవాహం, ప్రాంతీయ శాంతి, ప్రపంచ స్థిరత్వం దెబ్బతిన్నాయ న్నారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని లిన్ జియాన్ అమెరికాకు సూచించారు. ప్రస్తుత ఘర్షణలు ఆగితేనే ప్రాంతీయ స్థిరత్వం సాధించగలమని పేర్కొన్నారు. ఈనెల చివర్లో ట్రంప్ బీజింగ్ పర్యటన గురించి అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో ఈ పర్యటన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆదివారం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. హోర్ముజ్ ప్రాంతంలో చైనా ప్రయోజనాలే ఎక్కువని వ్యాఖ్యానించారు. ఆ జలసంధిని రక్షించేందుకు ముందుకురావాలని బీజింగ్‌కు పిలుపునిచ్చారు. ఆ దేశం ఇచ్చే సమాధానాన్ని బట్టి బీజింగ్ పర్యటనకు వెళ్లాలా, వాయిదా వేయాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటానన్నారు.

The post అమెరికాకు మిత్రదేశాల షాక్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *