ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ (కేంద్ర సచివాలయం) నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసింది. సుమారు రూ. 2534 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపింది. ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించి, నిర్మాణం పూర్తయితే అమరావతి కేంద్రంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ ఒకే గొడుగు కిందకు రానున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని ఆఫీసులను ఒకేచోట ఏర్పాటు చేయాలనేది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ పరిణామంపై ఏపీ బీజేపీ నేతలు స్పందించారు. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని వారు తెలిపారు. కీలక ప్రాజెక్టుల ద్వారా అమరావతి అభివృద్ధికి తమ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. కేంద్ర కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే ఈ ప్రాజెక్టు పనులు పట్టాలెక్కే అవకాశం ఉందని, ఇది రాజధాని అభివృద్ధిలో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.


