అమరావతికి మరో కీలక ప్రాజెక్టు – Visalaandhra


కేంద్ర కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణం
రూ.2,534 కోట్లతో కార్యాలయాలు, నివాస భవనాలు
22.53 ఎకరాలు కేటాయించిన సీఆర్‌డీఏ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మాణం చేపడుతున్న తరహాలోనే… అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, వాటిలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.2,534 కోట్లతో చేపట్టనున్న ఈ నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదానికి సీపీడబ్ల్యూడీ పంపింది. వీటిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం రూ.1,299.08 కోట్లతో ప్రాజెక్టు డీపీఆర్ తయారైంది. కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాలకు రూ.1,234.91 కోట్లతో ప్రాజెక్టును ప్రభుత్వం రూపకల్పన చేసింది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్‌లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. అమరావతి కేంద్ర ంగా పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఈ భారీ ప్రాజెక్టు తదుపరి అనుమతులకు కీలకమైన కేబినెట్ సెక్రటేరియట్ ఆమోదం పొందాల్సి ఉంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన దస్త్రానికి మాత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఆమోదం తెలిపారు. ఇక కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణానికి సీఆర్‌డీఏ మొత్తం 22.53 ఎకరాలు కేటాయించింది. అందులో 5.53 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బహుళ అంతస్తుల భవనం, మిగిలిన 17 ఎకరాల్లో ఉద్యోగుల నివాస సముదాయ భవనాల నిర్మాణం జరగనుంది. ప్రాజెక్టుపై ఎప్పటికప్ప్పుడు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇవిగాక మరో 10 ఎకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తామని హడ్కో వెల్లడించింది. కేబినెట్ సెక్రటేరియట్ నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది. వచ్చే వారం జరిగే కేంద్ర మంత్రివర్గంలో దీనికి ఆమోదం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *