కాబూల్: అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ మెరుపు దాడి చేసింది. ఆ దేశ రాజధాని కాబూల్‌పై విరుచుకుపడింది. అక్కడి ఆసుపత్రిపై వైమానిక దాడి చేయగా, 400 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని అధికారులు వెల్లడించారు. అఫ్గాన్, పాక్ మధ్య సరిహద్దు ఘర్షణ చాలా కాలంగా సాగుతున్నది. కాబూల్‌లోని 9వ పోలీస్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న డ్రగ్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని లక్ష్యంగా పాకిస్థాన్ చేసిన తాజా దాడిలో ఆసుపత్రి ప్రధాన భాగం ధ్వంసమైంది. మరణించిన వారిలో మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడేందుకు చికిత్స పొందుతున్న వారున్నట్లు తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది.
పాక్ సైనిక చర్యను తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ దాడులు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని దుయ్యబట్టింది. అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని పాక్ మరోసారి ఉల్లంఘించిందని, రోగులపై దాడులు చేయడం దారుణమని పేర్కొంది. సరిహద్దులో జరిగిన కాల్పుల్లో నలుగురు పౌరులు చనిపోయారని కూడా సర్కారు తెలిపింది. ఇదిలావుంటే, అఫ్గాన్ ఆసుపత్రిపై దాడి చేసింది తాము కాదని పాకిస్థాన్ ఓ ప్రకటన చేసింది. అఫ్గాన్ ఆరోపణలను తోసిపుచ్చింది. నివాస ప్రాంతాలు, ఆసుపత్రులపై వైమానిక దాడులు చేయలేదని ఓ ప్రకటన చేసింది. గత నెలలోనూ ఉగ్ర స్థావరాలపై దాడులను ప్రస్తావించింది. తాజా దాడుల నేపథ్యంలో రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ప్రజలు ప్రాణభయంతో వలస వెళ్తున్నారు.
సంయమం పాటించాలి: చైనా పిలుపు
అఫ్గాన్, పాకిస్థాన్ దేశాలు సంయమం పాటించాలని చైనా పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు, సైనికుల భద్రతకు హామీ ఉండేలా చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నట్లు తమ పొరుగు దేశాలనుద్దేశించి పేర్కొంది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు తమ వంతు నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు కట్టుబడి ఉన్నట్లు చైనా వెల్లడించింది.
The post అఫ్గాన్ ఆసుపత్రిపై పాక్ దాడిలో 400కు పెరిగిన మృతులు appeared first on Visalaandhra.


