అన్నీ ఉచితాలంటే ఎలా?


సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూదిల్లీ: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ముందే రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఎందుకు తీసుకొస్తున్నాయని ప్రశ్నించింది. దేశాభివృద్ధికి ఆటంకం కలిగించే ఈ తరహా విధానాలపై పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. తమిళనాడు ఎన్నికల వేళ డీఎంకే ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వినియోగదారుల ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అందరికీ ఉచిత విద్యుత్ అందించేలా తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదించింది. ఇందుకోసం 2024 ఎలక్ట్రిసిటీ అమెండ్‌మెంట్ రూల్స్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చాలా రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు పెరుగుతున్నప్పటికీ ఉచిత పథకాల పంపిణీ కొనసాగుతోంది. ఇలాంటి పథకాలతో రాష్ట్రాలతో పాటు దేశాభివృద్ధికి విఘాతం కలుగుతోంది. ఆహారం, విద్యుత్… ఇలా అన్నీ ఉచితంగా ఇస్తూ పోతుంటే మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాం? సంక్షేమ చర్యల్లో భాగంగా విద్యుత్ చార్జీలు చెల్లించే స్థోమత లేనివారికి ఉచిత విద్యుత్ అందిస్తారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మీరు ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తామని చెబుతున్నారు. ఇది బుజ్జగింపు రాజకీయ విధానం కాదా’ అని ధర్మాసనం ప్రశ్నించింది. విద్యుత్ టారిఫ్‌లను నోటిఫై చేసిన తర్వాత ఉన్నట్టుండి ఉచిత విద్యుత్‌పై ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సీజేఐ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ముందే రాష్ట్రాలు ఇలాంటి పథకాలు ఎందుకు తీసుకొస్తున్నాయని ఆగ్రహం వెలిబుచ్చింది. ఎన్నికల సమయంలో అన్నీ ఉచితంగా పంచుకుంటూపోతే అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క పైసా మిగలదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఒక్క తమిళనాడు సమస్యే కాదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్‌కు బదులు ఉపాధి సృష్టి కోసం కృషి చేయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు కొన్ని ప్రధానాంశాలను లేవనెత్తింది. సంపన్నులకు ఉచితాలెందుÅ£ని ప్రశ్నించింది. పేదలకు విద్య, కనీస అవసరాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని కోర్టు అంగీకరించింది. అయితే, పెద్ద పెద్ద భూస్వాములకు కూడా ఉచిత విద్యుత్ అందించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘సౌకర్యం కావాలనుకున్నప్ప్పుడు డబ్బులు చెల్లించాలి కదా. పెద్ద భూస్వాములు ఉచితం అని అనవసరంగా లైట్లు, మెషీన్లు వాడుతున్నారు’ అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే ఉచిత పథకాలను ప్రకటించే సంస్కృతిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు, సామాజికవేత్తలు తమ సిద్ధాంతాలను పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికింది. ప్రభుత్వం ఇచ్చే ఉచితాల వెనుక ఉన్నది ప్రజల కష్టార్జితమైన పన్నుల సొమ్ము అని గుర్తు చేసింది. రాష్ట్రాలు అప్ప్పుల్లో ఉన్నప్పటికీ ఉచిత పథకాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. రాష్ట్రాలు వసూలు చేసే ఆదాయంలో కనీసం 25 శాతాన్ని రాష్ట్ర అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఎందుకు ఉపయోగించకూడదని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. సంక్షేమం పేరుతో ఆర్థిక క్రమశిక్షణను విస్మరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని అత్యున్నత న్యాయస్థానం పరోక్షంగా హెచ్చరించింది. ఈ పిటిషన్‌పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

The post అన్నీ ఉచితాలంటే ఎలా? appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *