అనంతపురం: తాడిపత్రి పట్టణంలోని శ్రీ చల్లని తల్లి సుంకులమ్మ దేవాలయం స్థానికులకు ఆరాధ్య స్థలంగా నిలుస్తోంది. ఈ ఆలయానికి సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది పండుగ సమయాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండడంతో దేవాలయం కళకళలాడుతుంది.
స్థానికులు ఈ అమ్మవారిని “చల్లని తల్లి”గా పిలుస్తూ భక్తితో పూజిస్తారు. ఈ తల్లిని దర్శించుకుంటే జీవితంలోని కష్టాలు తొలగి, దీవెనలు లభిస్తారని భక్తులు విశ్వసిస్తారు. పెన్నా నది తీర ప్రాంతంలో ఈ అమ్మవారి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
సుంకులమ్మపాలెం ప్రాంతంలో వెలిసిన ఈ ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడి ప్రజలు తమ ఆరాధ్య దైవంగా భావించి భక్తితో పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం రోజుల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.
రైతులు వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు. ఈ ఆలయం స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు కేంద్రంగా నిలుస్తోంది.


