హైదరాబాద్: ప్రముఖ సినీహీరో పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ అరంగేట్రంపై మళ్లీ చర్చ జోరందుకుంది. అకీరా ఎంట్రీ ఎప్పుడు? ఎవరి దర్శకత్వంలో? అన్న విషయమె కొంత కాలంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చర్చలో హీరో/డైరెక్టర్ అడివి శేష్ పేరు వినిపించడం ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇంతకుముందు అకీరాను శేఖర్ కమ్ముల పరిచయం చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అడివి శేష్ అకీరా అరంగేట్రం బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం ఊపందుకుంది. అకీరాతో శేష్‌కు ఉన్న సాన్నిహిత్యం ఈ వార్తలకు బలం ఇస్తోంది. ముఖ్యంగా ‘రైటర్స్ బ్లాక’ షార్ట్ ఫిల్మ్‌కు అకీరా సంగీతం అందించినప్పుడు శేష్ మద్దతుగా నిలిచారు. ఆ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన అడివి శేష్… అకీరా కోసం ప్రత్యేకమైన, వైవిధ్యమైన కథ సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వారసుడి తొలి సినిమా కాబట్టి సాధారణ కమర్షియల్ ఎంట్రీ కాకుండా, కంటెంట్ బేస్డ్ సినిమా అయ్యి ఉండాలని పవన్ కల్యాణ్ కూడా భావిస్తున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్‌లో శేష్ దర్శకత్వం వహిస్తారా? లేక కేవలం కథ అందిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.


