అకాల వర్షం… అపార నష్టం – Visalaandhra


. అనేక జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు
. చేతికొచ్చిన మొక్కజొన్న, మునగ, అరటి నేలమట్టం
. సత్వరం ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ వాతావరణంలో సంభవించిన ఆకస్మిక మార్పుల వల్ల కురిసిన అకాల వర్షాలు, వీచిన ఈదురు గాలులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. కడప, ఎన్టీఆర్, కష్ణా తదితర జిల్లాల్లో సాగు చేసిన వాణిజ్య పంటలు చేతికి వచ్చే సమయంలోనే నేలమట్టమవ్వడం రైతు లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సాధారణంగా మార్చి, ఏప్రిల్‌లో పంటలు కోతకు సిద్ధంగా ఉంటాయి. ఇలాంటి తరుణంలో వరుణుడు అకాలంగా విరుచుకుపడటం వల్ల రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన పంట చేతికి రాకుండా పోయింది. మునగ, మొక్కజొన్న, అరటి తదితర పంటలు ఈదురు గాలి తాకిడికి తట్టుకోలేక నేలకొరిగాయి. పెట్టుబడి పెట్టిన సొమ్ము తిరిగి రాని పరిస్థితి ఏర్పడటంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా మునగ తోటలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తారు. ఎకరాకు దాదాపు రూ. 40 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు అన్నీ కలిపి భారీగా వెచ్చించిన తరుణంలో, ఈదురు గాలుల ప్రభావంతో చెట్లు విరిగిపోయాయి. మైలవరంలోని దాదాపు ఆరు గ్రామాల్లో మునగ తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంకా కాయలు కోతకు రాకముందే ఈ విపత్తు సంభవించడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకునే క్రమంలో పడిన శ్రమ అంతా వృథా అయిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కృష్ణాజిల్లాలో మొక్కజొన్న పంటకు భారీ నష్టం వాటిల్లింది. మొక్కజొన్న పంట కాలం 110 రోజులు ఉంటుంది. 70 రోజుల దశలో, అంటే గింజలు పాలు పోసుకునే సమయంలో ఈ అకాల వర్షాలు కురవడంతో గాలి వేగానికి మొక్కలు విరిగి నేలపాలయ్యాయి. మైలవరం, నందిగామ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 500 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుండగా, వందలాది ఎకరాల్లో పంట నాశనమైంది. ఎకరాకు రూ.50 వేలకుపైగా ఖర్చు చేసిన రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నేలవాలిన మొక్కజొన్న కంకులు కుళ్లిపోయే ప్రమాదం ఉండటంతో నాణ్యత దెబ్బతిని మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం కష్టతరమవుతుంది. రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లాలోను గాలి బీభత్సం సృష్టించింది. కాశీనాయన మండలం సావిశెట్టిపల్లె గ్రామ పరిసరాల్లో ఈదురు గాలుల తాకిడికి అరటి తోటలు నేలమట్టమయ్యాయి. అరటి సాగు అనేది రైతులకు అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. గాలి వేగానికి గెలలతో సహా చెట్లు విరిగిపోవడంతో రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లింది. వాటితో పాటు సజ్జ పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. అప్పులు చేసి పంటలు వేసిన రైతులు…ఇప్పుడు వాటినెలా తీర్చాలో తెలియక సతమతం అవుతున్నారు. ప్రకృతి ఆగ్రహానికి గురైన తమను తక్షణమే ప్రభుత్వం గుర్తించి, క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది వెంటనే గ్రామాల్లో పర్యటించి పంట నష్టపరిహారం ప్రక్రియను ప్రారంభించాల్సిన అవసరముంది. పంట నష్టపోయిన ప్రతి రైతుకు హెక్టారుకు నిర్ణీత పరిహారాన్ని యుద్ధ ప్రాతిపదికన అందజేయాలని, బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేసి, తదుపరి పంట సాగు కోసం కొత్త రుణాలను మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే..తాము మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు దేశానికి వెన్నెముక అని చెప్పడమే కాకుండా, కష్టకాలంలో వారిని ఆదుకోవాలని పేర్కొంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *