అంబటికి బెయిల్


విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరయింది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు… ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయనపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి… ఈ బెయిల్‌తో గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అంబటికి బెయిల్ రావడంతో గుంటూరులోని ఆయన నివాసం వద్ద వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. టీటీడీ లడ్డూ వివాదంలో సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో గుంటూరు నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో నమోదయిన కేసులో అంబటిని అరెస్ట్ చేసిన పోలీసులు… ఆయనను కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్‌పై తరలించారు. ఈ కేసులో అంబటికి ఇప్పటికే బెయిల్ మంజూరయింది. ఇక గత ఏడాది నవంబరు 12 న పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ అంబటి రాంబాబు అధ్వర్యంలో గుంటూరులో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల సూచనలను పట్టించుకోకపోవడంతో పాటు వారిపైనే దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలతో అంబటిపై కేసు నమోదయింది. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటిని గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్‌పై ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు మాజీ మంత్రికి ఈనెల 20 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో బెయిల్ కోసం అంబటి రాంబాబు పిటిషన్ వేయగా… అందుకు ఎక్సైజ్ కోర్టు అనుమతి ఇస్తూ… షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

The post అంబటికి బెయిల్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *