అంతర్జాతీయ ఉద్రిక్తతలు..పెరిగిన బంగారం, వెండి ధరలు


అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో బంగారం, వెండి ధరలు ఇవాళ‌ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పసిడికి డిమాండ్ పెరగడంతో రేట్లు ఆకాశాన్నంటాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్‌)లో ఏప్రిల్ 2 గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 2.27శాతం పెరిగి, ఇంట్రాడేలో 10 గ్రాములకు రూ. 1,42,660 గరిష్ఠ స్థాయిని తాకింది. ఇది ఒకే రోజులో రూ. 3,167 పెరగడం గమనార్హం. ఆ తర్వాత కాస్త తగ్గి, రూ. 3,007 లాభంతో రూ. 1,42,500 వద్ద ట్రేడ్ అయింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. మే 5 సిల్వర్ ఫ్యూచర్స్ ధర 3.65శాతం మేర ఎగబాకి, కిలోకు రూ. 2,27,901 రికార్డు స్థాయిని నమోదు చేసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి కిలో వెండి సుమారు రూ. 7,925 లాభంతో రూ. 2,27,799 వద్ద నిలిచింది. అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా మదుపరులు ఈక్విటీల నుంచి పెట్టుబడులను బంగారం, వెండి వంటి సురక్షితమైన సాధనాల వైపు మళ్లిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఈ విలువైన లోహాల ధరలు పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2శాతానికి పైగా తగ్గి బ్యారెల్‌కు 100 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *